షోడశ (16) అవస్థలు


జాగ్రత లో జాగ్రత
మనసున మరపులేక యుండుట. మరపు లేక యుండుట అంటే?
అంటే జాగ్రత లో జాగ్రత. అంటే విన్నది విన్నట్లుగా ధారణ చేయాలి. రెండవసారి అడగ కూడదు. అర్థమైందా? అండీ!

మరపు లేక యుండుట అంటే?
కనీసం, హీనపక్షం స్థితప్రజ్ఞత్వం అన్నా వుండాలి. బుద్ధిపరిధిలో వుంటే మరిచిపోతావు. అర్థమైందా? అండీ! జీవభావంలో వుండి వింటే, అంతాకూడా మరపు అంటే ఇక్కడ అర్థం అది. జీవతనువులు నాలుగులో వుండి వినేవాడికి, ఈ విధానాన్ని ధారణ చేసే శక్తి వుండదు. ఎవరికైతే తురీయంలో వుంటారో వాళ్ళకి ఒక్కసారి చెబితే చాలు. ఏదైనాసరే. రెండవసారి చెప్పవలసిన అగత్యము రాదన్నమాట! అలా వాళ్ళు విన్నది విన్నట్లుగా ధారణ చేసి, మరపు అనేది వుండదన్నదన్నమాట! వాడికెప్పుడు ఎరుక స్థితిలోనే వుంటాడు. ఏ విషయమైనా సరే, వాడు వెనక్కివెళ్ళి వెనక్కితిరిగి చూసుకోవటం అనేది వుండదు. కాబట్టి ఇప్పుడు మనం నిత్యజీవితంలో...

జాగ్రతలో జాగ్రత అంటే ఏమిటిప్పుడు?
తురీయం కదా నీకు లక్ష్యం. అంటే మరపు లేకుండా వుండాలి. అంటే ఒక వ్యక్తిని కానీ, ఒక జీవిని కానీ, ఒక స్వభావాన్ని కానీ, ఒక అంశాన్ని కానీ ఏదైనా కావచ్చు, అలా నీవు ఒకసారి దానిని గమనిస్తే, అది ఎంతకాలమైనా నీకది మరపులోకి రాదన్నమాట. అంటే తురీయం చెప్పాలి అంటే, ఎవరికైతే మరుపు లేదో, వాడి ప్రాథమిక లక్షణం అన్నమాట అది. అర్థమైందా? అండీ!
ఏ అంశం అయినా సరే, అతనికి మరుపు వుండదండి. తురీయం వాడిలో ఆవిర్భవించింది, ఆత్మానుభవం ఆవిర్భవించింది అంటే అర్థం ఏమిటంటే, వాడికెప్పుడూ మరపు అనే దశ వుండదన్నమాట ఇక వాడికి. ఏదైనాసరే!
అక్కడ తురీయంలో వ్యావహారిక జ్ఞానమని, ఆధ్యాత్మిక జ్ఞానమని ఇన్ని జ్ఞానాలు లేవు. ఉన్నది ఒక్క జ్ఞానమే. ఆ ప్రజ్ఞా స్థితిలోనుంచి చూచినవాడికి, మరుపు అనేది వుండదన్నమాట. ఏ సమయానికి ఎలా కావాలంటే, అది వెంటనే అది జ్ఞాపకం వచ్చేస్తుందన్నమాట. అర్థమైందా? అండీ! ఎవరు ఎక్కడ ఏ గ్రంథంలో ఏ విషయమన్నా అడగనివ్వండి, అతను... సాధ్యమైనంతవరకు ఆ మరుపు అనేది ఏ పరిస్థితులలోనూ అతనని ఆవరించదన్నమాట. మరుపు అంటే అజ్ఞానం అన్నమాట!
            (ఇక్కడ మనసు అనే పదం వుంది) ఆఁ... ఎందుకని మనసు అన్నారు? అంటే జీవభావానికి గుర్తు అన్నమాట. మనస్సు అంటే జీవుడికి గుర్తు.

మనసుకు మరపు వాటిళ్ళకూడదు అన్నాడు. అంటే అర్థం ఏమిటి?
జీవభావంలోకి రాకూడదు. ఎప్పుడూ కూడా తురీయం లక్ష్యంలో వున్నవాడు ఎప్పుడూ నిరంతరాయంగా, ప్రతీక్షణం ఆత్మభావంలోనే వుండాలి.
(విశ్వమనస్సు...)
ఇంకోమెట్టు, ఇంకా అవతల పైకి అది. ఇంకాపైకి. అయితే, ఇక్కడిప్పుడు మనం ఎప్పుడూ కూడా,

విశ్వమనస్సు అంటావే అనుకోండి, ఎలా చెప్తావు దానిని?
వేదాంతం ఏం చేస్తుందంటే అందుకే, నీవు కొలబద్ద లేని మాటలు మాట్లాడవద్దు అంది. అంటే ఉపనిషత్‌ పద్ధతిగా మాట్లాడేటటువంటి పద్ధతిలో, ప్రతిదీ ప్రమాణ పూర్వకముగా వుంటుంది అక్కడ.
            అదే చెప్పేది ఇప్పుడు, ఇక్కడ విషయం ఏమిటంటే, శృతి ప్రమాణయుక్తంగా అంటే, ఉపనిషత్‌ ప్రమాణయుక్తంగా మాట్లాడేటప్పుడు, కొన్ని పదాలకు అక్కడ విలువలేదు. కానీ, అది అర్థం చేసుకోవడం కష్టం ఉందని ఇప్పుడు మనం మామూలు తెలుగు మాటల్లోకి తెచ్చుకునేటప్పుడు ఇలాంటి పదప్రయోగం వచ్చిందన్నమాట. నిజానికి మీరు ఉపనిషత్తులు తిరగేస్తే ఎక్కడా మీకు విశ్వమనస్సు అన్నపదమే దొరకదు. ఆ ప్రమాణం లేదన్నమాట. మనసంటే అక్కడ జీవుడే. సమానార్థకం మనసనగా జీవుడు. అంతే. అక్కడ అసలు ఉపనిషత్తులు ఎక్కడా శరీరం సంగతి మాట్లాడవు.
మనసుంటే అన్నీ వున్నట్లే. అర్థమైందా? అండీ! నువ్వది వ్యష్టికే పెట్టుకుంటావో, సమిష్టికే పెట్టుకుంటావో నీ ఇష్టం దేనికన్నా పెట్టుకో. మనసంటూ వుంటే దానికి, దాని లక్షణాలు దానికి వుంటాయి. కాబట్టి దానికి మరుపు వుంది. ప్రజ్ఞకు మరుపు లేదు. కాబట్టి,

ప్రాథమిక దశలో నువ్వు ఎలా వుండాలి?
 ‘జాగ్రతలో జాగ్రత అంటే ఎప్పుడూ స్థితప్రజ్ఞుడవై వుండాలి. మరుపు అనేది లేకుండా వుండాలి. అజ్ఞానం లేకుండా వుండాలి.

జాగ్రత లో స్వప్నము
గురువు వద్ద శాస్త్ర విషయములను వినునప్పుడు, పరాకు పడుట చేత ఆ విషయములు జ్ఞాపకము వుండియూ వుండక యుండుట. అంటే అర్థము ఏమిటి?
జాగ్రతలో స్వప్నముఅంటే, బుద్ధికి రెండు దోషాలున్నాయి. అన్యథాగ్రహణము, అగ్రహణము. పరాకు అంటే అక్కడ అర్థము అది. ఏ లక్ష్యంలో చెప్తున్నాడో లక్ష్యార్థములో వుండక వాచ్యార్థములో వున్నప్పుడు నీకు పరాకు వస్తుంది అన్నమాట! అది పరాకు అంటే. గురువు ఎప్పుడూ లక్ష్యార్థములో నిలబడి చెబుతూ వుంటాడు. కానీ, నీకు వాచ్యార్థం అర్థమౌతూవుంటుందన్నామాట. అప్పుడు నువ్వు జ్ఞాపకం పెట్టుకోలేవు, ఆ ధారణాస్థితి వుండదన్నమాట. ఆ వాచ్యార్థమే స్థిరపడుతుంది కానీ, లక్ష్యార్థము స్థిరపడదు. అది జాగ్రతలో స్వప్నము. అంటే అక్కడే వున్నాడు కానీ, ఆ స్థితిలో లేడని అర్థం. లక్ష్యార్థ స్థితిలో లేడు.

జాగ్రత లో సుషుప్తి
గురువు వద్ద సద్విషయములను వినవలయునని, ప్రారంభించి వినునప్పుడు, హెచ్చరిక లేమిచే, అవి బొత్తిగా జ్ఞాపకము లేకపోవడము. ఎట్లా అంటే, ఇదంతా కూడా ఇక్కడ వ్రాసింది మర్మంగా వ్రాశారు. అన్యాపదేశంగా వ్రాశారన్నమాట! అంటే ఎవరో ఒకరు గురువు నీకు వివరించి చెప్తేనే, అర్థమయ్యే పద్ధతిలో వ్రాశారన్నమాట! (Narration) నారేషనే అలా వ్రాశారు. ఎందుకని అంటే జీవన్ముక్తావస్థకి తొలిమెట్టన్నమాట ఇది. జీవభావంలోంచి కిందకి చెప్పడంలేదు. జీవన్ముక్తావస్థకి తొలిమెట్లు ఇవి. ఈ 16 అవస్థలు తెలియాలి. అందుకని ఇక్కడ ఎక్కడ వేశారు? 16 అవస్థలను తెచ్చి? దరిదాపు అచలం మొట్టమొదట్లో వేశారన్నమాట వీటిని.
            ఎందుకు చెప్తున్నారంటే, షోడశీకళ అని శాక్తేయ సంప్రదాయంలో ఒకటి వుంది. అర్థమైందా? అండీ! ఆ షోడశీకళ పేరు బిందువు అన్నమాట. బిందు త్రికోణములు వృత్తాకార సంయుక్తంగా శ్రీ చక్రం వుంటుంది. దాంట్లో ఆఖరి కళ షోడశీకళ, ప్రథమ కళ రెండూ కూడా బిందువే అయివుంటుందన్నమాట. ఆ ప్రథమ ప్రస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ షోడశిని వేశారు. సరే దాన్ని అర్థం చేసుకోవడమని ఈ తురీయ స్థానంలో కూడా వుండేది అదే. బిందువే వుంటుంది.
సరే, ఆ విధానం మీకెవకీ లేదు కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్నలు అడిగినా ప్రయోజనము లేదు. అది ఊరకే విషయం తప్ప మీరు ఉపయోగించుకోలేరు. ఆషోడశి అనటంలో అక్కడ ఉద్దేశ్యం అదే. తురీయస్థానమే బిందుస్థానం ఆధారంగా అక్కడ నువ్వు వున్నావని, సృష్టంతా ఆ బిందుస్థానం నుంచే ఉత్పన్నమైంది. ఎప్పటికైనా మీరు తురీయానుభవం, ఆ బిందు మండలం యొక్క అనుభవం తెలియాలి, తెలుస్తుంది. అది తెలుసుకోవడం కోసమే దీనికి షోడశావస్థలు అని పెట్టారు. సరే, అది ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఇదన్నమాట!
 జాగ్రత లో సుషుప్తి అంటే అర్థం ఏమిటంటే? ఇందాక చెప్పాం కదా, అన్యథాగ్రహణం అంటే లక్ష్యార్థం చెబుతూ వుంటే, వాచ్యార్థాన్ని స్వీకరించడం వల్ల, నీకది జ్ఞాపకం వుండకుండా వుండేటువంటి పరిస్థితులు ఏర్పడడం. అపుడు మరలా నీకు వాచ్యార్థం వీలు పొందినప్పుడు లక్ష్యార్థ సూచన తెలియదన్నమాట. జాగత్తలో సుషుప్తి అంటే అగ్రహణం. అసలు గ్రహించలేక పోవడం. ఎందుకని? పూర్తిగా జీవభావంలో వున్నాడన్నమాట. అలాగా ఈ మూడు అవస్థలు ఇదైతే,

జాగ్రతలో తురీయం
వస్తునిశ్చయజ్ఞానాన్ని యథాతథంగా చెప్పింది చెప్పినట్లు దర్శించ గలగడం జాగ్రతలో తురీయం. అంటే వింటూ వున్నప్పుడే నీకు దర్శనం కలగాలి. ఈ ముందు మూడు ఎందుకు ఈ లక్ష్యంలో చెబుతున్నారు. అర్థమైందా? అండీ!
ప్రతి అవస్థలో కూడా, ప్రతిదాంట్లో కూడా ఒక తురీయం చెబుతారు. ఆ తురీయంలో ఏముంటున్నాడు ఇప్పుడిక్కడా? జాగ్రతలో తురీయం అంటే, గురువు వద్ద శాస్త్ర శ్రవణము చేయుటచే, వస్తుతత్వజ్ఞానము కలిగి, ఆ వస్తువును చింతించుట.

వస్తుతత్వజ్ఞానము అంటే అర్థమేమిటి?
ఏదైతే బోధిస్తున్నారో, ఆ బోధారూప జ్ఞానం నీకు దర్శనరూపంలో సాక్షాత్కరించడం. ఏ మనోవాక్కాయములు బుద్ధితో పని లేకుండా, ఇంద్రియాతీత మైనటువంటి దర్శనం, బోధ వింటున్నప్పుడే, నీకది ఆ దర్శనం కలగడం. అది వస్తునిశ్చయజ్ఞానం అంటే. అటువంటి వస్తునిశ్చయజ్ఞానం నీకు ఎప్పుడైతే బోధ విన్నప్పుడే కలిగిందో, అప్పుడు నీకు జాగ్రతలో తురీయం’. అలాగే

స్వప్నంలో జాగ్రత
స్వప్నంలో జాగ్రతఅంటే ఏమిటి?
కలగని లేచి, తాను కలలో కన్నవానినెల్ల తప్పక చెప్పుట. అంటే వరుసగా ఏ కల తరువాత ఏ కల వచ్చంది అనేది వరుసగా చివరిదాకా చెప్పగలగడం. అది కలలో జాగ్రత.

ఇక్కడ కల అంటే అర్థం ఏమిటి ఇప్పడు? అంటే
నీవు స్థితప్రజ్ఞత్వ స్థితిలో వున్నప్పుడు, ఇంద్రియాల ప్రభావం నీ మీద వున్నప్పుడు కల వచ్చింది. ఇంద్రియాల ప్రభావం లేనప్పుడు కల లేదు. ఆ ఇంద్రియాల ప్రభావము, ప్రజ్ఞా ప్రభావము ఈ రెండింటిని స్పష్టంగా గమనించ గలిగినటువంటి సాక్షి, తాను సాక్షిగా వుండి, కలను సాక్షిగా చూస్తున్నాడు. కాబట్టి ఏ కల తరువాత ఏ కల వచ్చిందనేది, సాక్షిగా వుండి చెప్పగలుగుతున్నాడు. అది కలలో జాగ్రత.

స్వప్నంలో స్వప్నం
కలగని లేచి అందలి విషయములను మరచి మరువక యుండుట.
అంటే అర్థం ఏమిటి?
కొంత ప్రభావం వుందన్నమాట. స్వప్నంలో కొంత ఇంద్రియాల ప్రభావం వుంది. అక్కడ కూడా ఇదే బుద్ధి మళ్ళా అన్యథా గ్రహణానికి, అగ్రహణానికి గురై, సాక్షిత్వస్థితిని యథాతథంగా నిలబెట్టుకోలేకపోవడం అనే దశ చేత, కొంత ప్రభావానికి లోనైనప్పుడు కొన్ని చెప్పగలగడం, కొన్ని చెప్పలేకపోవడం. కొంతభాగం మరపులోకి పోవడం. అది స్వప్నంలో స్వప్నం’.

స్వప్నంలో సుషుప్తి
కలగని మేల్కొని ఆ కలయందు తాను కన్నదంతయూ మరచుట. అంటే అర్థం ఏమిటి? ఒక ఏదో ఇక చిత్తవృత్తి యొక్క ప్రభావం అక్కడ ఏర్పడింది. ఏర్పడంగానే నీకు మెలకువ వచ్చింది. ఆ బలమైన ప్రభావం చేత నీకు మెలకువ వచ్చింది. మెలకువ రాగానే ఈ కల అంతా మరపులోకి వెళ్ళిపోయింది. అదిస్వప్నంలో సుషుప్తి.
అంటే సాక్షీ భావంలో బలంగా లేనప్పుడు, ఈ స్వప్నంలో స్వప్నంగానీ, స్వప్నంలో సుషుప్తి యొక్క ప్రభావంగానీ ఇవన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు

స్వప్నంలో తురీయం

స్వప్నంలో తురీయం అంటే ఏమిటి?
కలలో తాను కొండమీదను, ఏనుగు మీదను ఎక్కినట్లు, లక్ష్మీదేవి తాను వరించి పొందినట్లు, కని లేచి, దాని ఫలమును విచారించి, తనకు రాజ్యాధిపత్యము వచ్చుననియు, సంపద కలుగుననియు ఎంచగా, ఇది అంతయూ మనోవ్యాపారమే గానీ, వేరుకాదని నిశ్చయించి, బ్రహ్మనిష్ఠ నుండి చలింపక యుండుట.

ఎక్కడట ఇప్పుడిది?
స్వప్నంలోనే తురీయం అంటే, స్వప్నాన్ని స్వప్నంలోనే పరిష్కరించాడు.

దేనితో పరిష్కరించాడు?
బ్రహ్మనిష్ఠతో పరిష్కరించాడు.

అంటే, అంతకు ముందు చెప్పిన మూడు స్థితుల్లో ఇప్పుడు ఏమైనట్లు?
బ్రహ్మనిష్ఠ నుంచి కొద్దిగా మార్పు వచ్చింది, ప్రభావవంతమైంది అన్నమాట, అప్పుడు స్వప్నంలో స్వప్నం, స్వప్నంలో సుషుప్తి అయ్యింది.

అదే బ్రహ్మనిష్ఠలో నువ్వు స్థిరంగా వున్నప్పుడు ఏమయ్యావు?
స్వప్నంలో తురీయంగా వున్నావు. అంటే స్వప్నాన్ని స్వప్నంలోనే పరిష్కరించాడు. దానికి కారణం ఏమిటంటే, కారణశరీరం తాను కాదని బ్రహ్మనిష్ఠలో సహజంగా వుండడం. ఎందుకని అంటే? కారణశరీరాన్ని చెరపకుండా, సూక్ష్మశరీరాన్ని చెరపడం వీలుకాదు. కారణ శరీరం నుంచే సూక్ష్మశరీరం ఉత్పన్నం అవుతుంది కాబట్టి.

కాబట్టి, కారణ శరీరాన్ని చెరపాలి అంటే ఏం చేయాలి?
అవిద్య అజ్ఞానావృతం అయినటువంటి కారణ శరీరమే, గుణాత్మకమైనటు వంటి సూక్ష్మశరీరానికి కారణం కాబట్టి. ఈ గుణాలన్నీ ఆ అవిద్యనుంచే ఉత్పన్నమైనవి కాబట్టి.

నీకు బ్రహ్మానుసంధానం ఎంతగా బలపడి వుండాలయ్యా? అంటే,
మూడు అవస్థలలోనూ బ్రహ్మస్వరూపం నేనే అయివున్నాను అనే బ్రహ్మనిష్ఠలో నిలిచియున్నవాడికి కలని కలలోనే పరిష్కరించగలిగే సామర్థ్యం వస్తుంది. అది స్వప్నంలో తురీయం.

సుషుప్తిలో జాగ్రత
సుఖముగా నిద్రించి లేచి, ఆ నిద్రాసుఖము ఇట్టిదని తెలిసి చెప్పుట.

ఎవరైనా నిద్రాసుఖము గురించి చెప్పగలరా?
నిద్రపోయి లేచి నేను సుఖంగా వున్నాను అంటాడు తప్ప, నిద్రాసుఖం గురించి మాట్లడడన్నమాట..
అయితే బ్రహ్మనిష్ఠుడు చెప్పగలుగుతాడు.
ఎందుకనిట?
(బ్రహ్మనిష్ఠుడు) సుషుప్తికి వేరై చూస్తున్నాడు. ఏ సుఖంలో ఇంద్రియాలు మునుగుతున్నాయి, ఎట్లా లేస్తున్నాయి అనేది, వేరుగా వుండి చూస్తున్న తన సమక్షంలో ఇంద్రియాలు నిద్రపోతున్నాయి. తన సమక్షంలో ఇంద్రియాలు కలగంటున్నాయి. తన సమక్షంలో ఇంద్రియాలు మేల్కొంటున్నాయి. తాను వేరుగా వున్నాడు. ఈ దశలో వుంటాడన్నమాట ఎప్పుడూ బ్రహ్మనిష్ఠుడు. ఇలా వున్నటువంటి వాడు ఆ నిద్రాసుఖం ఇట్టిదని తెలిసి చెప్తున్నాడు. అది సుషుప్తిలో జాగ్రత.

సుషుప్తిలో స్వప్నం
సుఖముగా నిద్రించియు, దానివలన సుఖము ఎట్టిదో, అది తోచియూ తోచక యుండుట. అంటే ఇక్కడ కూడా అదే సమస్య. అలాగే సుషుప్తిలో సుషుప్తి.

సుషుప్తిలో సుషుప్తి
నిద్రించి లేచిన పిమ్మట దాని సుఖం ఇట్టిదని తెలియక యుండుట. ఏమీ చెప్పలేకపోవడం.

సుషుప్తిలో తురీయం
సుఖముగా నిద్రించియు, ఆ నిద్రావస్థ అజ్ఞాన విషయమును గానీ, ప్రజ్ఞానఘన ప్రత్యగాత్మనైన నాకు విషయము కాదని తెలియును.
అంటే మనఃశరీరములకు నిద్ర అనేది విషయముగానీ, ప్రజ్ఞానఘనుడైనటువంటి ప్రత్యగాత్మనైనటువంటి నాకది విషయము కాదు. అంటే ఆ విషయసుఖం నాకు లేదు. ఆ విషయానందము నాకు లేదు. అని చెబుతున్నాడు.
కాబట్టి, అలా ఎప్పుడైతే నువ్వు సుషుప్తిలో తురీయాన్ని లక్ష్యంగా పట్టుకున్నావో, సుషుప్తి సమస్య పరిష్కారం అయ్యింది. స్వప్నంలో తురీయాన్ని పట్టుకుంటే, స్వప్నం సమస్య పరిష్కారం అయ్యింది. జాగ్రతలో తురీయాన్ని పట్టుకుంటే, వస్తునిశ్చయజ్ఞానం తో పాటు, దర్శనానుభవజ్ఞానం కూడా కలిగింది. కాబట్టి స్వప్నంలో గానీ, సుషుప్తిలో గానీ ఇప్పుడు నిన్ను ఆ బ్రహ్మనిష్ఠలో వుంచేది ఏదయ్యా? అంటే,
గురుబోధాసమయంలో నీకు కలిగినటువంటి దర్శనానుభవజ్ఞానమే, నిన్ను అక్కడ తురీయంలో వుంచుతుంది. కాబట్టి జాగ్రతలో తరీయం దశ వరకూ తప్పనిసరిగా రావాలి. అందుకని గురువు దగ్గర ఉపదేశం పొందినప్పుడుగానీ, బోధ విన్నప్పుడు గానీ, ఆ దర్శనస్థితి నీకు కలుగుతుందా? లేదా? ఆ దర్శనానుభవజ్ఞానం చాలా ముఖ్యం. అది మనోవాక్‌ అతీతమైనటువంటిది, ఇంద్రియాతీతమైనటు వంటిది. అది. అటువంటి దర్శనానుభవజ్ఞానం నువ్వు ఎప్పుడైతే పొందావో, ఈ దర్శనానుభవ జ్ఞానం నీకు స్వప్నంలో సుషుప్తిలో ఉపయోగపడి, అక్కడ స్వప్నతురీయాన్ని, సుషుప్తి తురీయాన్ని అందిస్తుంది.

తురీయంలో జాగ్రత
ఇప్పుడుతురీయంలో జాగ్రత. బ్రహ్మనిష్ఠయందు వుండునప్పుడు జాగ్రత యందలి వ్యాపారములైన ఆకలిదప్పులు తోచి, ప్రపంచ వృత్తి కలుగుట.

(ఆకలిదప్పులు తోచి, ప్రపంచ వృత్తి కలుగుట) అంటే అర్థం ఏమిటి?
ప్రాణ వ్యాపారం యొక్క ప్రభావం చేత ఏర్పడుతున్న క్షుత్పిపాసలు తెలియటం. ఆ తెలియడమే బ్రహ్మనిష్ఠుడికి జాగ్రదావస్థ. అంటే అవి తప్ప మిగిలినవేవీ తెలియవని అర్థం. ప్రాణ వ్యాపారములైన క్షుత్పిపాసలు తెలియడం వరికే వాడికి జాగ్రదావస్థ పనిచేస్తుంది. మిగిలిన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైనటువంటి ఏ విషయం కూడా అతను గుర్తించలేడు, తెలియదన్నమాట. అలా తెలియక జగత్తు యొక్క స్పృహలేకుండా వుంటాడు. మనః శరీరముల యొక్క స్పృహలేకుండా వుంటాడు.

తురీయంలో స్వప్నం
ఆ బ్రహ్మనిష్ఠ యందున్నప్పుడు ఆకలిదప్పులు తోచి, ప్రపంచ వృత్తులు కలిగి కలుగక యుండుట. అంటే ప్రాణ ప్రభావముచేత ఏర్పడిన క్షుత్పిపాసలు, తనకు తెలిసినా తెలియక ఊరక వుండుట. వాటికి కూడా సాక్షిగా వుండడం.
(జీవన్ముక్తావస్థకు చెప్తున్నాడు ఇప్పుడు ఇది.)

తురీయంలో సుషుప్తి
బ్రహ్మనిష్ఠయందు వికల్పమేమియూ లేకయుండుట. అంటే సంకల్పం వుంటే వికల్పం వుంటుంది. కాబట్టి, తాను బ్రహ్మము అనేటు వంటి ప్రయత్నంగానీ, సాధనగానీ, సంకల్పంగానీ ఏమీ వుండదన్నమాట. తనకు తాను సహజంగా ఏ సంకల్పము వికల్పము లేక బ్రహ్మమునందు మునిగి వుంటాడు. అది తురీయంలో సుషుప్తి.

తురీయంలో తురీయం
జాగ్రత్‌ స్వప్న సుషుప్తుల వలన కలిగెడు, ఆ 15 భేదములను లేక, అఖండ పరిపూర్ణ సచ్చిదానంద పరబ్రహ్మము తానే గానీ, తనకంటే వేరుకాదనెడి వృత్తి భేదము లేక  పరబ్రహ్మము అగు తాను తానై వుండుట అదియే అవికల్ప వికల్పము. అంటే సహజనిర్వికల్పము అని అర్థం అన్నమాట. ఇటువంటి సహజ నిర్వికల్పమైనటువంటి, తురీయంలో తురీయం అంటేనే సాయుజ్య ముక్తి. దీనినే సాయుజ్యముక్తి అని కూడా అంటారు. పరబ్రహ్మ నిర్ణయం తెలుస్తుందన్నమాట. బ్రహ్మనిష్ఠ నుంచి పరబ్రహ్మ నిర్ణయంలోకి మారుతాడు, ఈ తురీయంలో తురీయం అనే దశలో. ఇక్కడి నుంచే అచల సిద్ధాంతం ప్రారంభం అవుతుంది. తురీయంలో తురీయంఅనే పరబ్రహ్మ నిర్ణయంతోనే అచల సిద్ధాంతము ప్రారంభము అవుతుంది.

జాగ్రతఅంటే ఏమిటసలు?
మనసు దశేంద్రియములతో కూడి, శబ్దాది విషయములను అనుభవమునందు కలిగియుండుట జాగ్రదావస్థ.

స్వప్నం అంటే ఏమిటి?
మనసు క్రమముగా క్షీణించి, గాఢ నిద్రను పొందక, ఆ జాగ్రత యందలి విషయముల అనుభవములను కలిగియుండుట.

సుషుప్తిఅంటే?
మానసాది సర్వేంద్రియ వ్యాపార శూన్యము గాఢనిద్రావస్థ.
తురీయముఅంటే?
దేవుడు కలడనే ఆస్తిక బుద్ధి కలిగి, ప్రమాణముల చేత, అసత్తు సత్తు అను భేదము కల లౌకిక కర్మ, ద్వైతాద్వైతముల కల్పన, విమర్శించి ఒప్పు జ్ఞానము కలిగియుండుట తరీయము.

ఈ నాలుగు అవస్థలు ఒకొక్కటి నాలుగేసి భాగములుగా భావింపబడి, 16 అవస్థలు అయ్యెను. ఈ 16 అవస్థలు ఎందుకు చెప్పారంటే, ఈ 16 అవస్థలలోనే ఎఱుక యొక్క వ్యాపారము, వ్యవహారము అంతా వున్నది.

అంటే, జీవులను ఎఱుక ఎట్లా నడుపగలుగుతుంది ఇప్పుడు?
అంతటా అందరియందు వున్నది ఎఱుకే అంటున్నావు కదా!

సర్వజీవులయందు, జడచేతనములన్నిటియందు వున్నది ఎఱుకే అంటున్నావా? లేదా?
అఖండ ఎఱుక అంటే ఏమంటున్నావు?
అనంత విశ్వమంతా వ్యాపించి వున్నది.

ఇప్పుడీ అనంత విశ్వంలో వున్నటువంటి కొండకు ఈ 4 అవస్థలు వున్నాయా? లేవా?
ఉన్నాయి అంటుంది. వేదాంతం ఏం చెప్తుందంటే, పరబ్రహ్మ నిర్ణయము దశకు వచ్చేటప్పటికి, జడచేతన భేదం నువ్వు కల్పించుకున్నావు. విశ్వసృష్టి యందు జడ-చేతన భేదం లేదు.
అదే చెప్పేది, ఇదంతా జీవభావం నుంచి క్రమముక్తిలో మాట్లాడతున్న విధానంలో అలా మాట్లాడుతున్నారు. ఇది ఎఱుక పద్ధతి.

ఇప్పుడు ఇందాకడిదాకా ఎలా మాట్లాడారు?
ఆత్మభావం, ఆత్మానుభవం... బ్రహ్మనిష్ఠ వరకూ మాట్లాడుతుంటే, మాట్లాడుతున్నారు.


ఇప్పుడు అచల పద్ధతిలో ఈ 16 అవస్థలను వివరిస్తే ఏమైందప్పుడు?
అఖండ ఎఱుక ఈ 16 అవస్థల ద్వారా జడ చేతనముల యందు వ్యాపించి వున్నది. అంటే

ఈ నాలుగు నాలుగుల పదహారు ఎవరికున్నాయయ్యా? అంటే,
కొండకు, బండకు కూడా వున్నాయి. భూమికి పంచభూతాలకు కూడా వున్నాయి. అర్థమైందా అండీ! కాబట్టి మరి పంచభూతాలకు స్వప్నం ఏమిటండి? పంచభూతాలకు సుషుప్తి ఏమిటి? అంటే భూమి తిరగదా? తిరుగుతూ తన్ను తాను తెలుసుకోలేదా? అసలు భూమికి తెలుసుకునే శక్తి వుందా? అంటే ఇప్పుడు material fact లో మాట్లాడుతున్నాడా?
అందుకని ఎవరికైతే తురీయంలో తురియంవుందో, అతడు ఈ షోడశావస్థలు వింటేనేమో, పరబ్రహ్మ నిర్ణయం దిశగా వున్నటువంటి, అశరీర జ్ఞానము, ఇంద్రియాతీత మైనటువంటి, ఆ దర్శన జ్ఞానం కలుగుతుంది.
ఎవరైతే ఇదే 16 అవస్థలని జీవభావం ఆత్మభావం మధ్యలో వింటేనేమో, ఆత్మాసాక్షి అనేటు వంటి దర్శనజ్ఞానం కలుగుతుంది.
ఎవరైతే ఆత్మసాక్షాత్కారం కలిగి, బ్రహ్మానుభవం మధ్యలో వుంటారో వారికేమో సమిష్ట్యానుభవ సూత్రమయినటువంటి బ్రహ్మనిష్ఠ కలుగుతుంది.
కాబట్టి ఇదే 16 అవస్థలే జీవభావంలో వున్నవారికి పనికొస్తాయి, అదే ఆత్మభావంలో వున్నవాడికి పనికొస్తాయి. బ్రహ్మానుసంధానం చేసేవాళ్ళకి పనికొస్తాయి. బ్రహ్మనిష్ఠ ఏర్పడడానికి పనికొస్తాయి. చివరిదశ అయినటువంటి తురీయంలో తురీయం పరబ్రహ్మ నిర్ణయానికి కూడా పనికొస్తాయి. అందుకని సాధకులందరికీ ఈ షోడశావస్థలు సాధనామార్గం అయివున్నదన్నమాట.
అందుకనే ఏం చెప్తున్నారు? నీకెలా వున్నాయో చూసుకోమంటున్నారు. ఇందాక కూడా ఏం చెప్పాం? ఇక్కడ అనేక తరగతుల సాధకులు వున్నారు. వీళ్ళందరూ ఏం చేయాలట ఇప్పుడు? ఆ షోడశావస్థలు నాకెట్లా? నిన్ను నీవు సరి చూసుకోవడానికి పనికొస్తుందట. అంటే...
గురువాక్య శ్రవణం చేస్తున్నా, చేస్తున్నప్పుడు నేను ఎలా వున్నాను?
అర్థమైందా అండీ! ఆయనేం చెప్పాడు ఇప్పుడూ?
జాగ్రతలో తురీయం అంటే అర్థం ఏమిటి?
వింటూ వున్నది, విన్నది విన్నట్లుగా, దర్శనజ్ఞానంగా, నీకు అనుభవ జ్ఞానానికి రావాలి. అది జాగ్రతలో తురీయం.

అలా సంసిద్ధుడవై వున్నావా? అప్పుడెలా పట్టుకుంటావట ఇప్పుడు?
జాగ్రతలో తురీయం స్థితి గనుక వచ్చినవాడికి నాలుగు దశలలో వున్న తురీయమే పట్టుకుంటాడు. అంటే జాగ్రతలో వున్న తురీయం, స్వప్నంలో వున్న తురీయం, సుషుప్తి తురీయం, తురీయంలో తురీయం finish. ఆ చివరి నాలుగు అవస్థలే వుంటాయి. అర్థమైందా అండీ! ఒకసారి ఈ మూడు తురీయం – సుషుప్తిలో తురీయం దాకా వచ్చేస్తే, తరువాత తురీయం స్థితిలో వున్న నాలుగు అవస్థలే అయిపోతాయి.

కాబట్టి, నీకెప్పుడూ లక్ష్యార్థము ఏమైయున్నది?
జాగ్రతలో తురీయం, స్వప్నంలో తురీయం, సుషుప్తిలో తురీయం, తురీయంలో తురీయం ఎప్పుడూ లక్ష్యార్థమై వున్నాయి. ఈ తురీయంలో తురీయమేమో పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజేస్తుంది. ముందున్న మూడవస్థలలో వున్న తురీయమేమో బ్రహ్మనిష్ఠను కలుగజేస్తుంది. బ్రహ్మానుభవాన్ని కలుగజేస్తుంది. కాబట్టి,

ఈ షోడశావస్థల యొక్క విశేషం ఎంతయ్యా? అంటే,
నీ సచ్చిష్య పదవికి ఎంత అర్హత, నీ సర్వార్పణ భావం ఎంతుందో కూడా ఇందులో తెలిసిపోతుంది. ఉపదేశం అలా వింటూ వుండగానే, ఆ దర్శనానుభవజ్ఞానం కలగాలి. నీకెదన్నా ఒకటి చెప్పారనుకోండి, ఆ చెప్పింది చెప్పినట్లుగా, అలాగే ఆ శాస్త్రం చదువుతున్నామనుకోండి ఆ శాస్త్రంలో ఏదైతే చెబుతున్నాడో, ఆ చదువుతూ వున్నదో, చెబుతూ వున్నదో, వింటూ వున్నదో అవి యథాతథంగా దర్శనానుభవజ్ఞానంలోకి వెళ్ళిపోవాలి. అది తురీయలక్షణం ఎప్పుడూ కూడా. ఈ లక్షణం చాలా ప్రధానం.

అప్పుడు ఎలా వుంటావట?
విషయేంద్రియ సంయోజనమైన జ్ఞానం మీద ఆధారపడవు.
ఇప్పుడు దేనిమీద ఆధారపడుతున్నావు?
దేనిని నిర్ణయించాలన్నా విషయం వుండాలి, ఇంద్రియం వుండాలి.

ఇప్పుడు ఎలా వున్నావంట?
ఈ విషయేంద్రియ సంయోజనముతో అవసరం లేదు. దీంతో ఏం పని లేకుండానే, ఏ జీవినైనా సరే, ఏ స్థితిలో వున్నవాడినైనా సరే, ఏ సాధకుడైనాసరే, జడమైనా చేతనమైనా సరే, అలా చూడగానే దానియొక్క స్థితి ప్రభావాలన్నీ తెలిసిపోతూ వుంటాయి. ఆ దర్శనశక్తి వుంటుందన్నమాట వాడికి.

ఈ దర్శనశక్తి వున్నవాడికి ఏమిటి ప్రయోజనం అంటే?
వీడేమీ భూత, భవిష్యత్‌, వర్తమానాలు చెప్పలేడు. కానీ, ఒక సాధకుడికి ఎక్కడ సహాయపడాలో వాడికి తెలిసివుంటుంది. కాబట్టి, గురువైన వాడికి, ఆ బ్రహ్మనిష్ఠలో వున్నటువంటి వాడికి, గురుపీఠంలో వున్నవాడికి, పూర్ణాధికారులందరికీ కూడా ఈ శక్తి వుండాలి. ఎప్పుడూ కూడా! అప్పుడే నువ్వు సహాయం చేయగలుగుతావు.
బోధించేటప్పుడు ఎదుటివాడు ఏ స్థితిలో వున్నాడో నువ్వు చూడగలగాలి. ఆ స్థితిలో నువ్వు సహాయం చేయగలగాలి.

(సహాయం) ఎట్లా చేస్తావు?
ఆఁ ... ఈ దర్శనానుభవజ్ఞానం లేకపోతే సహాయం చేయలేవు. అంటే వాక్‌రూపం లో బోధ చెప్పడం ఎంత అవసరమో, నీ బోధ వింటూ వుండగానే వాడిలో ఆ బోధాప్రభావం చేత లక్ష్యార్థం దర్శనంగా ఆవిష్కరింపబడాలి. ఆ సామర్థ్యం అతనికి రావాలన్నమాట. ఆ శక్తి ఆ వాక్కులో వుండాలన్నమాట. ఆ బలం ఆ దర్శన స్పర్శన సంభాషణల్లో వుండాలన్నమాట. అందుకే మంత్ర త్రయాలని, దీక్షాత్రయాలని ఎందుకు పెట్టారంటే, ఆ మంత్రత్రయం, దీక్షాత్రయం అయ్యేటప్పటికి మీకు ఏమైపోవాలట? ఆ దర్శనానుభవం. నువ్వు అది అయ్యిపోవాలి అంతే. తత్త్వమసి- మహావాక్యంలో ఆ అసి పదంలో నిన్ను కూర్చోపెట్టడం కోసమే ఈ దీక్షలన్నీ మంత్రత్రయాలన్నీ కూడా.

కాబట్టి, అప్పుడేమయ్యాడు?
గురుశిష్యుల బేధంగా లేరు. గురుశిష్యుల ఐక్యత అయిపోయారన్నమాట. అటువంటి ఐక్యతాసిద్ధి వున్నటువంటి సద్గురువు-సచ్చిష్యుడు అయితేనే ఈ తురీయపద్ధతి సాధ్యం అవుతుంది.

మిగిలినవాళ్ళు అందరూ ఏమిటట?
అవస్థాత్రయ పద్ధతి.
ఈ షోడశావస్థలలో రెండు భాగాలుగా విడగొట్టేశాడన్నమాట. అందుకే...

గురువు బోధించవలసిందని ఎందుకు చెప్తున్నారు?
ఆఁ... గురువు బోధించినప్పుడు నిన్ను తురీయ లక్ష్యంలో పెట్టి, నిలబెట్టి చెప్తాడన్నమాట. అప్పుడేమవుతావు. తురీయాన్నే పట్టుకుంటావు. మిగిలిన మూడు అవస్థలని పట్టుకోవు.

ఇప్పుడు నువ్వు చదువుకున్నప్పుడు నీకేది అందుబాటులో వున్నట్లు కనబడుతుంది?
మూడవస్థలు అందుబాటులో వున్నట్లు కనబడుతుందన్నామాట.

ఇది అందులో వున్నటువంటి తేడా. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించాలి. ఎప్పుడు గ్రహించాలి అంటే,
నీవు సద్గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు, నువ్వు ఈ స్థితిలో వున్నావా లేదా? చూసుకోవడానికి అన్నమాట ఇది. ఎప్పుడూ కూడా.
నేను సద్గురువుని ఆశ్రయించాను. ఆశ్రయించినప్పుడు ఇప్పుడు నేను ఏ స్థితిలో వుండి ఆశ్రయించాను?16 అవస్థలలో ఇప్పుడు నేను ఏ స్థితిలో వున్నాను?
(చూసుకోవాలన్నమాట.)
నిన్ను నువ్వు సరిచూసుకోవడానికి, నీ జ్ఞాననిర్ణయం నీ ముక్తావస్థ, నిర్ణయాన్ని నీకు తెలియజెప్తాయి.
నువ్వు నిజంగా ముక్తుడవేనా? నీకు ఎవరిస్తారు certificate? ఈ ప్రపంచంలో ఎవ్వరూ, నీ ముక్తి గురించి ఎవ్వరూ certificate ఇవ్వరు. ఎందుకు?
అది నిశ్చయాత్మకజ్ఞానం. ఇందాక ఏం చెప్పాడు? తాను బ్రహ్మనిష్ఠుడననే నిశ్చయాత్మక జ్ఞానంలో వుండడమే తురీయంలో తురీయమునకు ప్రాథమిక మైనటువంటి స్థితి. ఆ తురీయంలో తురీయం నేను బ్రహ్మనిష్ఠుడననేటువంటి ఆ బ్రహ్మానుభవం చేత, పరబ్రహ్మ నిర్ణయం దిశగా లక్ష్యార్థం అన్నమాట.

అంటే, అక్కడ వాచ్యార్థం ఏమిటి?
బ్రహ్మనిష్ఠ. బ్రహ్మానుభవం వాచ్యార్థం.

లక్ష్యార్థం?
పరబ్రహ్మ. తురీయంలో తురీయానికి.

అంటే సాయుజ్య ముక్తి వాచ్యార్థం. ఆ సాయుజ్యముక్తి యొక్క అనుభవం చేత, పరబ్రహ్మనిర్ణయం చేయగలగడం లక్ష్యార్థం. అర్థమైందా అండీ!
 
అంటే ఎఱుక యొక్క వ్యాపారాన్ని లేనిదిగా తెలుసుకోవడం లక్ష్యార్థం. అఖండ ఎఱుక యొక్క వ్యాపార సహితంగా లేనిదే! బయలులో ఈ అఖండ ఎఱుక లేనిదే!” అనేటటువంటి లక్ష్యార్థ నిర్ణయాన్ని పొందడం పరబ్రహ్మ నిర్ణయం పొందడం.
లేని ఎఱుక అనేదాన్ని పొందడాన్ని, ఆ దిశగా నడవాలన్నమాట! నీ యొక్క జీవన్ముక్తానుభవం. ఆ బ్రహ్మనిష్ఠ యొక్క అనుభవం. అలా నీకు ఆవిష్కరింపబడటానికి, ఈ షోడశావస్థలు ఉపయోగపడుతాయి.
ఎవరైతే బ్రహ్మనిష్ఠ కలిగివుంటారో, వారు కింద్ర వున్నటువంటి మూడునాలుగుల పన్నెండు అవస్థలలోకి దిగి రాలేదు. దానికేం చెప్పాడు?
ఎవరైతే తురీయానుభవంలో వున్నారో, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందుతూ వున్నారో, వ్యవహారానికి దిగివస్తే ఎక్కడిదాకా దిగి వస్తాడు?
అంటే, స్వప్న తురీయానికి, సుషుప్తి తురీయానికి, జాగ్రత తురీయానికి అదే తురీయ స్థితిలోనే దిగి వస్తాడు తప్ప, సాధరణ జాగ్రతలో జాగ్రత, జాగ్రతలో స్వప్నము, జాగ్రతలో సుషుప్తి, స్వప్నములో జాగ్రత, స్వప్నములో స్వప్నము, స్వప్నములో సుషుప్తి, సుషుప్తిలో జాగ్రత, సుషుప్తిలో స్వప్నము, సుషుప్తిలో సుషుప్తి ... ఆ 12 అవస్థలలోకి వ్యవహారంలో కూడా దిగిరాడు. వ్యవహరించనే వ్యవహరించడు. వ్యవహరించవలసి వచ్చిందనుకోండి, ఇంద్రియాలతో వ్యవహరించవలసి వచ్చినా ఎలా వస్తాడట ఇప్పుడు?
తురీయంలో తురీయమేలక్ష్యంలో వుంటాడు. ఓ మెట్టు దిగుతాడు. సుషుప్తిలో తురీయం, ఇంకో మెట్టులో దిగితే స్వప్న తురీయం లేదంటే జాగ్రత తురీయం. ఆ తురీయ పద్ధతిలో వ్యవహరిస్తాడన్నమాట ఎప్పుడూ కూడా. ఇది బ్రహ్మనిష్ఠుడిని నువ్వు అనుసరించునప్పుడు గమనించవలసిన అంశం.
ఒక గురువుగారి దగ్గరకు వెళ్ళావు, ఆ గురువుగారిలో ఈ లక్షణాలు వున్నాయా? ఆయనతో మీరు సహవాసము చేశారు. ఆయనలో ఈ లక్షణాలు వున్నాయా?
వెతికి పట్టాలన్నమాట. అప్పుడే నీకు విశ్వాసం కలుగుతుంది.
ఎందువల్ల?
ఆయన యథార్థంగా జీవితంలో ఆచరించి చేస్తూ వుంటాడు. ఎప్పుడైతే ఆచరించి చేశాడో, ఆ అనుభవజ్ఞానాన్ని నువ్వు గమనిస్తూ వుంటావు. ఆ అనుభవజ్ఞానం ప్రభావం వల్ల ఆయనలో ఏర్పడినటువంటి జ్ఞాననిష్ఠ, ఆ బ్రహ్మనిష్ఠ, ఆ సహజ ముక్త స్థితిని నువ్వు గమనించగలిగేటటువంటి దశలో వుండాలన్నమాట. అప్పుడే నీవు తురీయాన్ని పట్టుకోగలుగుతావు. అందుకే గురువు ప్రత్యక్ష తార్కాణము. అర్థమైందా అండీ? ఎక్కడో వెతికితే కనబడడు అన్నమాట!
((ఈ నాలుగిటిని మహావాక్యాలకు కూడా అన్వయం చేయవచ్చా అండీ?))
చేయవచ్చు, ఏముంది ఎటైనా అన్వయం చేయవచ్చు. ఈ షోడశాస్థలలో వున్న గొప్పతనం ఏమిటంటే, ఏ స్థితికైనా అన్వయం చేయవచ్చు. ద్వైతానికి చేయవచ్చు, అద్వైతానికి చేయవచ్చు, అచలానికి చేయవచ్చు. నాలుగు మహావాక్యలను పట్టుకుని నాలుగు మహావాక్యాలను కూడా ఇట్లా విడగొట్టి చెప్పవచ్చు. అయితే ఒకటి,

ఎంతగా చెపితే, అప్పుడు నువ్వు ఎందులోకి వెళ్తావు?
ఎంతగా నువ్వు దానిని వ్యక్తీకరించ పూనుకునే కొద్దీ,
అష్టావక్రగీతలో ఏమంటాడు?
వ్యక్తీకరించేందుకు పూనుకుంటే బ్రహ్మనిష్ఠ నుంచి క్రిందకు దిగిరావాల్సి వస్తుంది అంటాడు. అంతేనా కాదా? ఎందుకని?

బ్రహ్మనిష్ఠ ఎందుకు నీకు అసలు?
పరబ్రహ్మ నిర్ణయం కోసం అవసరం వచ్చింది. అంతే తప్ప, బ్రహ్మనిష్ఠలో నీవు నిలబడిపోవడానికి కాదు కదా!

నువ్వు బ్రహ్మనిష్ఠ అనే అనుభవస్థితిలో ఎందుకు వున్నావు?
పరబ్రహ్మ నిర్ణయం అనే లక్ష్యార్థాన్ని పొందడం కోసం. అంతేగానీ, అది మధ్యలో మజిలీయేగానీ అది నీకు చివరి మజిలీ కాదు కదా! నీకసలు దాంట్లోనుంచి దిగివచ్చి మళ్ళా కింద వున్నవాడికి, జీవభావంలో వున్నవాడికి, నేనేదో అందించ పూనుకోవాలనుకోవడం నీకెందుకు అంటాడు.

ఎందుకని?
నువ్వు తురీయపద్ధతిలో వ్యవహరించాలి అనే నియమాన్ని పాటించాలి. అంటే,

నువ్వు ఎట్లా దిగిరావాలి ఇప్పుడు? వ్యవహారంలో ఎట్లా దిగిరావాలంట ఇప్పుడు?
జాగ్రతలో తురీయం.

(జాగ్రతలో తురీయం) అంటే ఏమిటి?
వస్తు నిశ్చయ జ్ఞానాన్ని ఏ పరిస్థితుల్లో కోల్పోకూడదు.

స్వప్న తురీయం అంటే?
(దానిని అక్కడే) స్వప్నాన్ని స్వప్నంలోనే, సూక్ష్మాన్ని సూక్ష్మంలోనే పరిష్కరించాలి.
ఊఁ... పరిష్కరిస్తే..
సుషుప్తిలో తురీయంఅంటే?
ఈ విషయానందము నాకు విషయము కాదు. సుషుప్తి నాకు విషయము కాదు. బ్రహ్మనిష్ఠుడికి సుషుప్తి విషయము కాదు. అని సహజంగా సుషుప్తిని నిరసించినవాడై వుండాలన్నమాట.

తురీయంలో తురీయంఅంటే?
పరబ్రహ్మ నిర్ణయం. తానే పరబ్రహ్మం అనేటటువంటి లక్ష్యార్థములో నిలబడి వుండడమే తురీయంలో తురీయం.

ఇప్పుడీ వ్యవహారం ఎలా వుండాలంటా? ఇప్పుడు ఎలాగా? అర్థమైందా అండీ! ఇప్పుడు?
నీకు ఎక్కడా ఎక్కడైనా ఎక్కడానికి ఛాన్స్‌ ఇచ్చారా? ఈ మూడింటిలో?
0.1% కూడా లేదు.

((తురీయంలో జాగ్రత – అవును. ప్రతిదాంట్లోనూ 4 నాలుగులు వుంటాయిగా మరి.))

జాగ్రతలో తురీయంకు, తురీయంలో జాగ్రతకు ఏం తేడా వుంది అంటారా?
మళ్ళా చదువు అయితే.

జాగ్రతలో జాగ్రత అంటే ఏం చెప్పారు?
గురుబోధను చెప్పింది చెప్పినట్లుగా ధారణ చేసి వుండడాన్ని జాగ్రతలో జాగ్రత అని చెప్పారు. అంతేకదా! జాగ్రతలో తురీయం అంటే వస్తునిశ్చయజ్ఞానము కలిగివుండటం.

వస్తునిశ్చయజ్ఞానం వలన నీకేం కలుగుతుంది?
అనుభవస్థితికి వెళ్ళడానికి దోహదపడుతుంది, అంతేకదా!

అంతకుమించి వేరే ఏమన్నా పనికివస్తుందా?
పనికిరాదు. కదా!
తురీయంలో జాగ్రత అంటే?
తురీయంలో జాగ్రత – బ్రహ్మనిష్ఠయందు వుండునప్పుడు, జాగ్రతయందలి వ్యాపారములైన ఆకలిదప్పులతో ప్రపంచ వృత్తి కలుగుట.
జాగ్రతలో తురీయం? వస్తుతత్వజ్ఞానం కలిగి ఆ వస్తువును చింతించుట తేడా లేదు?
           
            జగత్తు యొక్క స్పృహ, నీ మనఃశరీరముల యొక్క స్పృహ లేకుండటం అన్నమాట. అది తురీయంలో జాగ్రత. జాగ్రతలో తురీయం అంటే, ఆయా వస్తునిశ్చయజ్ఞానం కలిగివుండి, బ్రహ్మానుసంధానం చేసి, అక్కడ నిష్ఠ కలిగి వుండడం అన్నమాట. మీరు నిరంతరాయంగా అందుకే... ఈ షోడశావస్థలను ఎప్పుడూ గమనించుకుంటూ వుండాలి. అప్పుడే మీకు జ్ఞానం సహజమైందా? లేదా ? అనేది, ఇది విచారణాజ్ఞానమా? అనుభవజ్ఞానమా? అనేది ఇది తేలుస్తుందన్నమాట. అది తేల్చడానికి ఇదన్నమాట కొలబద్ద. అందుకే ఎప్పడైనా చెప్పింది. ఆ గురువును గమనిస్తూ వుండడం ఎందుకు అవసరమంటే, అతనికి నిద్రవుందో లేదో తెలియాలి. నిద్ర ఎలా వుందో తెలియాలి. ఇందాక చెప్పాడు. సుషుప్తికి సాక్షి అర్థమైందా అండీ! సుషుప్తి తనకు విషయము కాదని వుండటం – సుషుప్తిలో తురీయం. అట్లా వుండగలుగుతున్నాడా?

ఎందుకని ఈ 16 అవస్థలని గురువులో గమనించాలట?
అప్పుడే నువ్వు ఈ తురీయ సూత్రాన్ని పట్టుకోగలుగుతావు. అర్థమైందా! మీరందరూ ఇప్పుడు ఎవరినైనా గానీ, మహానుభావుల దగ్గరకి, పెద్దల దగ్గరికి వెళ్ళారు అనుకోండి,
వాళ్ళని ఇప్పుడు ఏ దృష్టికోణంలో గమనించాలట ఇప్పుడు? పైగా వారి వద్ద నీవు, ఏదన్నా ప్రశ్నించాలంటే, దేని గురించి ప్రశ్నించాలంట?
తురీయానుభవం గురించి ప్రశ్నించాలి.

కానీ, అందరూ ఏం ప్రశ్నిస్తున్నారు?
విచారణా జ్ఞానం, వాచా జ్ఞానం అన్నమాట అదంతా. ఆ గొడవ చెప్పడంతోటే సరిపోతుంది. వాళ్ళకే సుఖం కదా! అలఓకగా చెప్పేస్తారు.
వాళ్ళు నిన్ను తురీయంలో నిలబెట్టాలంటే కష్టమా? నీకు గుణ విచారణ చెప్పాలంటే కష్టమా?
తురీయంలో నిలబెట్టడం చాలా కష్టం కదండీ! అదంతా సులభంగా అయ్యే పనికాదు. అది గురుశిష్యులు ఇద్దరూ కష్టపడి సాధించాలది. ఆ అన్యోన్య ఆశ్రయధర్మం ఎప్పుడూ వుండాలి. అట్లా అయితేనే అది సాధ్యం అవుతుంది. అందుకనే చెప్పేది,
సర్వార్పణ భావం వుంటేనే తప్ప, గురువును అట్లా నువ్వు చూడలేవు. ఆ దృష్టినీకు, ఆ దర్శనజ్ఞానం కలిగించగలిగే సామర్థ్యం గురువుకు వుండాలి. చెబుతూ వుండగానే, నీకు ఆ బోధ ఆ స్థితిలో వుండి చెబుతూ వుంటే, ఆ స్థితి నీకు దర్శనానికి రావాలన్నమాట.
ఇలా ఇవన్నీ వాళ్ళు, పూర్వం తపో సంపన్నులైనటువంటి వాళ్ళు మానవ జీవితాన్ని ఎట్లా జీవించారంటే, వాళ్ళు మనలా ఏదో విషయ సంయోజనం కోసం జీవించినటు వంటి వాళ్ళు కాదు కదా! ఒక పెద్ద యజ్ఞభావంతో తపస్సుతోటి జీవించినటువంటి వాళ్ళు. ప్రతినిత్యము వాళ్ళు దాని నిమిత్తమే జీవితాన్ని జీవించినటు వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకుని, అలాంటి గురుశిష్యులు ఆదర్శం కదా! అలాంటి వాళ్ళనే ఇలా ఇలా గ్రంథస్తం చేశారన్నమాట. అయితే ఒకటి, అంత సాధ్యాసాధ్యాలు ప్రతిచోటా వుంటాయి. కానీ, అసాధ్యం కాదు. ఇవన్నీ సాధ్యమే. నీ అర్హతను బట్టి కొద్దిగా కాలభేదంలో జరుగుతుంది. అంతే తేడా.

షోడశ అవస్థలు, షోడశ కళలు రెండు వేరు వేరా?
వేరు వేరు. అది ఒక పద్ధతి, ఇది ఒక పద్ధతి. నీకు జ్ఞానం బోధించడానికి, నీ సంస్కారబలాన్ని బట్టి పెట్టిన సాధనామార్గాలు ఇవన్నీ. ఇలా ఎవరన్నీ గుర్తించ గలుగుతారు. ఈ షోడశావస్థలు అనేది ఎవ్వరికైనా తెలుస్తాయి. ఇంకా వేరే పద్ధతిలో చెప్తావనుకోండి, అదంతా మళ్ళా ఆ సాధన వేరు, ఆ క్రమం వేరు. (సాయిరాం).

ఓం తత్‌ సత్‌